చిత్రం: లేతమనసులు (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం:
గానం: యమ్.యమ్.కీరవాణి , సాధన సర్గం
నటీనటులు: శ్రీకాంత్ , గోపిక , కళ్యాణి
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: అనంత వర్మ
విడుదల తేది: 01.10.2004
పల్లవి:
ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా
ఆ నవ్వుల చల్లదనం ఆ శ్వాసల వెచ్చదనం
మమతలతో ఎదనింపిన ఆ మనసుల తీయదనం
ఎద వీడిపోని జ్ఞాపకాలుగా
వసివాడిపోని ఊహలై ఇలా
ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా
చరణం: 1
పొగడ చెట్టు నీడలో బొంగరాల ఆటలు
కోనలమ్మ కోనలో కొంటె కొంటె పాటలు
వెన్నెలమ్మ మేడలో ఆడుకున్న ఊసులు
గున్నమావి తోటలో పెంచుకున్న ఆశలు
గోడమీద రాసుకున్న ముద్దు పేరులు
ఊరిబైట మర్రికాడ కుర్ర చేష్టలు
తాయిలాలు పంచుకున్న తీపిగుర్తులు
గుండె దోచుకున్న వెండి చందమామలు
చిరు చినుకులలో మన సరిగమలు
ఎద పిలువక పిలిచిన పిలుపుల సవ్వడిలో
ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా
చరణం: 2
అట్లతద్ది రోజున పిట్టగొడ దూకుతూ
చేసుకున్న బాసలు మనసు మరిచిపోదుగా
మొదటిసారి పైటతో ఎదుట నిలచి నవ్విన
కన్నెజాబిలమ్మను కనులు మరువులేవుగా
పుస్తకాల చాటునుంచి దొంగచూపులు
చెరువుకాడ గురువుగారు పడ్డ తిప్పలు
కాలమన్న సాలెగూడు కట్టివేయగా
గొంతుదాటి పైకి రాని మూగప్రేమలు
ఒక అలజడిలో ఒక ఉరవడిలో
మది తెరువక తెరిచిన తలపుల తాకిడిలో
ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా
ఆ నవ్వుల చల్లదనం ఆ శ్వాసల వెచ్చదనం
మమతలతో ఎదనింపిన ఆ మనసుల తీయదనం
ఎద వీడిపోని జ్ఞాపకాలుగా
వసివాడిపోని ఊహలై ఇలా