Mutyala Muggu (1975)

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
నటీనటులు: శ్రీధర్, సంగీత, రావుగోపాల్ రావ్
దర్శకత్వం: బాపు
నిర్మాత: మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహ రావు
విడుదల తేది: 1975

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి
ఓ లచ్చ గుమ్మాడి  ఓ లచ్చ గుమ్మాడి

పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మాడి
పొద్దు కాదది నీ ముద్దు మోమున
దిద్దిన కుంకుమ తిలకమే సుమా
పొద్దు కాదది నీ ముద్దు మోమున
దిద్దిన కుంకుమ తిలకమే సుమా
వెలుగులు కావవి నీ పాదాలకు
అలదిన పారాణి జిలుగులే సుమా

చరణం: 1
ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి
ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి
ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా
ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా
ముగ్గులు కావవి నా అంతరంగాన
పూచిన రంగవల్లులే సుమా

చరణం: 2
మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చ గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చ గుమ్మాడి
మల్లెలు కావవి నా మహాలక్ష్మి
విరజల్లిన సిరినవ్వులే సుమా
మల్లెలు కావవి నా మహాలక్ష్మి
విరజల్లిన సిరినవ్వులే సుమా

*********  *********   ********

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ

చరణం: 1
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ

చరణం: 2
కోటలో తులసమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు
కోటలో తులసమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవల్లు

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ

చరణం: 3
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ

*********  *********   ********

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: గుంటూరు శేషేంద్ర శర్మ
గానం: పి. సుశీల

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

చరణం: 1
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

చరణం: 2
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకు చెప్పండి…

*********  *********   ********

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: యమ్. బాలమురళి కృష్ణ
గానం: యమ్. బాలమురళి కృష్ణ

శ్రీ రాఘవం దశరదాత్మజ మప్రమేయం
సీతాపతిమ్ రఘుకులాన్వాయ రత్నదీపం
అజానుబహుమ్ అరవింద దలాయతక్షం
రామం నిషాచర వినాశకరం నమామి నమామి

శ్రీ రామ జయరామ సీతారామ
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
కారుణ్యధామా కమనీయనామా

శ్రీ రామ జయరామ సీతారామ

నీ దివ్య నామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా

శ్రీ రామ జయరామ సీతారామ

నిలకడలేని అల కోతి మూకచే
నిలకడలేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ

శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ

*********  *********   ********

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: వి. రామకృష్ణ

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

చరణం: 1
ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం
ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

చరణం: 2
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూలపాన్పు వేశారు

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

*********  *********   ********

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

ఎంతటి రసికుడవో తెలిసెరా
నీవెంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా…

ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా…
ఎంతటి రసికుడవో తెలిసెరా

చరణం: 1
గుత్తపు రవిక ఓయమ్మో
చెమట చిత్తడిలో తడిసి ఉండగా
గుత్తపు రవిక ఓయమ్మో
చెమట చిత్తడిలో తడిసి ఉండగా
ఎంతసేపు నీ తుంటరి చూపు
ఎంతసేపు నీ తుంటరి చూపు
ఎంతసేపు నీ తుంటరి చూపు
అంతలోనే తిరుగాడుచుండగా

ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా…
ఎంతటి రసికుడవో తెలిసెరా

చరణం: 2
మోము మోమున ఆనించి
ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా
మోము మోమున ఆనించి
ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా
మోము మోమున ఆనించి
ముద్దు ముచ్చటలాడబోవగా
టక్కున కౌగిట చిక్కబట్టి
టక్కున కౌగిట చిక్కబట్టి
నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా

ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా…
ఎంతటి రసికుడవో తెలిసెరా
తెలిసెరా తెలిసె రారా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Swayamkrushi (1987)
error: Content is protected !!