అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని… లిరిక్స్
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీనివాస చక్రవర్తి కొమ్మినేని
సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం:ఎస్ పి బాలసుబ్రమణ్యం
నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి
నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేది: 06.07.1997
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా..
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా…
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం.. ఈ రక్తపు సిందూరం..
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా.. ఓ పవిత్ర భారతమా!
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా .. దాన్నే స్వరాజ్యమందామా…
కులాల కోసం గుంపులు కడుతూ.. మతాల కోసం మంటలు పెడుతూ..
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే.. జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో..
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని..
నిజం తెలుసుకోరే… తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి…
పోరి ఏమిటి సాధించాలి…
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం.. ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా…
ఓ అనాథ భారతమా!
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా..
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా…
అన్యాయాన్ని సహించని శౌర్యం.. దౌర్జన్యాన్ని దహించే ధైర్యం..
కారడవులలో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా… వెలుగుని తప్పుకు తిరగాలా..
శతృవుతో పోరాడే సైన్యం… శాంతిని కాపాడే కర్త్యవ్యం..
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా.. అన్నల చేతిలొ చావాలా..
తనలో ధైర్యం అడవికి ఇచ్చి… తన ధర్మం చట్టానికి ఇచ్చి..
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే..
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం..
ఈ సంధ్యా సిందూరం..
వేకువ వైపా, చీకటిలోకా, ఎటు నడిపేనమ్మా..
గతి తోచని భారతమా!
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా..
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా…
తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని..
తనలో భీతిని.. తన అవినీతిని.. తన ప్రతినిధులుగ ఎన్నుకుని..
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని…
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట .. ఆహాహా ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం.. !
కృష్ణుడు లేని కురుక్షేత్రమున.. సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం..
చూస్తూ ఇంకా నిదురిస్తావా…
విశాల భారతమా… ఓ విషాద భారతమా!